7, అక్టోబర్ 2022, శుక్రవారం

 ఆకుపచ్చ అడవిలో 

నల్లనైనా కోయిలమ్మ 

కుహు కుహు అంటూ 

కొత్తపాట పాడుతోంది. 

ఆ పాటకు పరవసించే 

కొమ్మమీది  పిల్ల కాకి 

అమ్మతోటి చెప్పింది 

పాటపాడ నేర్పమని. 

మన ఇంటనే పుట్టిందది 

పిచ్చి పాట పాడుతోంది 

మనకెందుకు రాగాలు 

కావు..  కావు..  మనకు చాలు. 

పెద్దకాకి మాటలకు 

చిన్నబోయే బుల్లికాకి 

ముద్దకూడ తినకుండా 

అలిగి మూల కూర్చుంది.

పిల్లని ఓదార్చ లేక 

కోయిలతో మాటలాడి 

తన పిల్లకు మంచి పాట 

నేర్పమంది అమ్మకాకి. 

దానికేమి భాగ్య మమ్మ 

ఉదయాన్నే పంపు దాన్ని 

సరిగమలు నేర్పిస్తా! 

నా అంతదాన్ని చేస్తా!

తల్లి ఆనతివ్వగానే 

గురువు చేరే కాకిపిల్ల 

కాళ్ళకు శ్రద్ధ గా మొక్కి 

సాధనను మొదలుపెట్టే. 

కాలము గడిచెను కానీ 

సరిగమలను దాటలేదు 

విసుగుపుట్టి గురువుపైన 

తిరగబడెను ఒకనాడు. 

పాటనెర్ప వేమీ నాకు

సంగీతం నాకెందుకు 

నేర్పడ యిష్టం లేక 

సాధనతో గడుపుతావు. 

సంగీతం నేర్చుకుంటే 

పాటపాడా తెలుస్తుంది 

నీకు నువ్వు కూర్చుకుంటే 

కొత్తపాట జనిస్తుంది.

ఒకే పాట నేర్చుకుంటే 

అక్కడనే నిలుస్తావు

మరోపాట పాడమంటే 

బిక్క మొహం వేస్తావు. 

గురువుగారి మాటలతో 

తే రుకుంది బుల్లికాకి 

క్షమించ మంటూ వేడి 

సాధన మొదలెట్టింది. 

ఆనతి  కాలం లోనే 

ఔపాశన పట్టింది

కాకి జాతి లోనే  తాను 

కోయాలగా మారింది.

 

    


15, జూన్ 2018, శుక్రవారం






చుక్కలలోకం

రెక్కలు వుంటే చుక్కల లోకం
చూసి వస్తాను.
మక్కువతోటి చందమామ తో
స్నేహం చేస్తాను
చల్లని వెన్నెల పిల్లల కోసం
తీసుకు వస్తాను
ఇంద్ర ధనస్సును భూమికి రమ్మని
ఆహ్వానిస్తాను
చల్లని ఆ నీలి మబ్బుని మచ్చిక
చేస్తాను
అవసరానికి నీరమ్మంటు
చెప్పే సోస్తాను
తారకలిచ్చే బహుమతులన్నీ
పిల్లల కిస్తాను
పిల్లలు ఇచ్చే తియ్యని ముద్దులు
ఆస్వాదిస్తాను 

19, మే 2018, శనివారం

....వానలు ...

వాన 
చక చక సాగే నీలి మబ్బులు.
టప టప కురిసే వాన చినుకులు.
ఘుమ ఘుమ లాడే మట్టి వాసనలు.
బిర బిర సాగే పిల్ల కాలువలు.
ఆహా ఎంత హాయి....
మన పల్లె లో నోయి ....
వానలు కురిసాయి.
చక్కని పంటలు పండాయి 
చెరువులు దరువులు నిండాయి
మొక్కలు  ఏపుగ పెరిగాయి..
చల్లని వాతావరణం లో
పిల్లల ఆటల పాటలతో 
సంతోషాలు సంబరాలతో 
పండుగ వచ్చింది 
పల్లెకు అందం తెచ్చింది.

11, మే 2018, శుక్రవారం

చదువు

చదువు కోవాలి పైకి ఎదగాలి పిల్లలు
ఈభువిలో విరబూసిన మరుమల్లెలు
అమ్మ వడిలో "  వుంగా " చదువు 
స్నానమాడి " కేరింతల" చదువు 
పాలు తాగుతూ "ఊసుల" చదువు
అమ్మేరా మన  తొలి " గురువు "

నాన్న తో "నడిచి" నేర్చిన చదువు 
"నమశివాయ" ని రాసిన చదువు
పలకపై "సున్నా" గీసిన చదువు 
నాన్నేరా మన "మలి గురువు"

పలకా బలపం పట్టుకుని 
గురువు చెప్పేది నేర్చుకుని 
బడినే గుడిగా మలచుకుని 
ప్రతి తరగతిని దాటుకుని 
నిన్ను నడిపేది గురువేరా
భవితను చూపే దేముడురా 

భగవంతుని  ప్రార్ధించాలి 
భాద్యతగా నువు నడవాలి 
అందరికీ దారిని చూపే 
ఆధ్యుడు నువ్వే కావాలి 

తల్లి తండ్రి గురువు దైవం 
అది మరిచినచో బ్రతుకే శూన్యం
తెలుసుకోవాలి బాలలు 
కలసి నడవాలి అందరూ ... 

5, డిసెంబర్ 2016, సోమవారం

భారతదేశపు ఆశా జ్యోతులు

పిల్లల మాటలు ఎంతో అందం 
పిల్లల పాటలు మకరందం 
పిల్లల నడకలు నడతలు అందం 
పిల్లలే ఇంటికి ఆనందం 
అల్లరి అయినా అందమే 
ఆటలు అయినా అందమే 
పరుగులు పెడుతూ వెనక్కి చూసి 
పడిలేచిన ఆనందమే 
పుస్తకాలతో కుస్తీ పడుతూ 
అంకెలు అన్నీ బట్టి పడుతూ 
పలక బలపం పట్టె పిల్లలు 
భావితరానికి విరిసిన మల్లెలు 
అమ్మ చెప్పేటి ఊసులు వింటూ 
నాన్నతో నడిచి మాటలు అంటూ
గారాబంగా మారాము చేస్తూ 
రేపటి రోజుకు బాటలు వేస్తూ 
ఎదిగే పిల్లలు రేపటి పౌరులు 
భారతదేశపు ఆశా జ్యోతులు  
 


9, జూన్ 2015, మంగళవారం

చదువునుఇష్టపడు

పరుగుపరుగునరారండిపాఠశాలతెరిచారండి

ఫుస్తకాలనుసర్ధండిపలకాబలపంపట్టండి!
 
కధలుకబుర్లుకట్టిపెట్టిఆటలుపాటలుపక్కకునెట్టి

శ్రద్దగానుచదవాలండిప్రధమంగానిలవాలండి

కష్టపడిచదవాలన్నదిపాతమంత్రము

ఇష్టపడిచదవాలన్నదికొత్తసూత్రము             !

కష్టంఇష్టంకలసివుంటేనెమేటివిజయము

అదితెలుసుకునిముందుకుసాగితెకలుగునుజయము.

ఎవరికోసమోఈచదువుఅనుమాటనువీడు

నీకోసంఈచదువుఅనుకుంటూనిరతంకష్టపడు !

చదువునుఇష్టపడు !

6, జూన్ 2015, శనివారం

నేటి.... మేటి..... విద్యార్ధి...



నేటి.... మేటి..... విద్యార్ధి...

ఉండాలోయ్... ఉండాలి...విద్యార్ధులకిదిఉండాలి....

విద్యతోపాటువినయముండాలి….సజ్జనులసహవాసముండాలి

పెద్దలంటేగౌరవముండాలి …   పేదలంటేఆదరణుండాలి..  //ఊండాలొయ్... ఉండాలి...//

చదువంటేఇష్టముండాలి……  కష్టపడేతత్వముండాలి..

కళలపట్లఅభిరుచివుండాలి..కలిమిలేమితెలిసుండాలి..//ఊండాలొయ్... ఉండాలి...//

పరీక్షలంటేభయముండాలి…….భయాన్నిజయించేతెగువుండాలి

మొదటిస్థానంతనదైవుండాలిఅందుకుతగ్గకృషివుండాలి//ఊండాలొయ్... ఉండాలి...//

గురువుదైవమనేభావనుండాలి… బడినేగుడిఅనుమనసుండాలి

ఆటలుండాలి..పాటలుండాలి….అన్నింటాఅభిరుచివుండాలి..//ఊండాలొయ్... ఉండాలి...//


తన ప్రత్యేకత తన కుండాలి..….    ఉన్నత స్థానం సాదించాలి

19, మార్చి 2013, మంగళవారం

తెలుగు భాషా సంవత్సర శుభాభినందనలు.


పండుగ సమయానా        ఒట్టేసి చెబుతున్నా
తెలుగు భాష మనదని         తెలుగే మాట్లాడుదునని.

తేనెకంటే తియ్యనైన                  పలుకులున్న భాష
వెన్నకన్న కమ్మనైన                విరుపులున్న భాష
పాయసంలా                            యతి ప్రాస వున్న బాష
ప్రాంతాలని బట్టి                        యాస వున్న భాష      
                     
అమ్మ.. ఆవు..అంటూ            అమ్మ నేర్పిన భాష
అల్లరిచే యొద్దన్న                  నాన్నమందలింపు భాష
అనగనగా.. అంటూ..              అమ్మమ్మ కథ భాష
అత్తా.. మామా.. అనే              అప్యాయతలున్న భాష  

వేమన పద్యం మనది               సుమతీ శతకం మనది
కవిత్రయపు కలం మనది          అష్టదిగ్గజ గళం మనది                      

శ్రీకృష్టదేవరాయ కలమున     చిలికిన భాష
బ్రౌన్ దొరమెచ్చుకున్న          విలువలున్న భాష
అన్నమయ్య పదాలు            త్యాగయ్య స్వరాలు
మిళితమైన భాష                   మృధుమదురమైన భాష

అక్షరములు ఎక్కువైనా            అందమైన భాష
నేర్చుకుంటే సులువుగా           మనసున నిలిచేభాష
స్వచ్చ మైన భాష                    మంచి ముత్యమంటి భాష
సరళ మైన భాష                      మొగలి సుమం వంటి భాష

దేశభాష లందు తెలుగు లెస్స                    అనండి
మీవంతు సహకారం                           అందించండి
ప్రాచీన భాష ఇది                                ఆదరించండి
బాస చేసి అందరు                              ఆచరించండి

30, నవంబర్ 2012, శుక్రవారం

ప్రకృతి



ఏమై పోతోంది మన ప్రకృతి
ఎక్కడి కెడుతోంది మన ప్రగతి

మనతో పాటు తిరుగాడే
జంతువులను చంపే దుస్థితి
పర్యావరణం రక్షించే
చెట్లన్నింటిని నరికే స్థితి.

అలికిడి చేయదు కుందేలమ్మా
ఆటలు ఆడే జింకేదమ్మా
నాట్యం చేసేనెమలేదమ్మా
పాటల మైనా కనరాదమ్మా

అడవిని పాలించే మృగరాజు
ఆతని తోడు నిలిచే పులిరాజు
సలహాలిచ్చే నక్కాలేదు
ఎలుగు, ఏనుగు కానరాదు.

పాము లేదు, పావురము లేదు
పాలపిట్ట జాడే తెలీదు
గ్రద్ద లేదు, పిచ్చుకలేదు
పక్షి జంతువులకు రక్షణలేదు

ఏపుగపెరిగే మొక్క లేదు
టేకు, గన్నర చెట్టు తెలీదు
చందన వృక్షపు చాయేలేదు
గంధపు వాసన అసలేరాదు

చెట్లను కొట్టే మానవులు
భవిత తెలీని దానవులు
మొక్కలు పెంచనివారు
వాటిని కొట్టేటందుకు తయారు.


అన్నితెలిసి చేసే తప్పుకు
భాధ్యత ఎవ్వరిది
ప్రకృతిని - వికృతిగా మార్చిన
పాపం ఎవ్వరిది.

చట్టాలెన్ని వున్నా
అడవికి రక్షణలేదు కన్నా
నాయకులెందరు వున్నా
న్యాయం జరగదు నాన్నా

ఆలోచించు ఇకనైనా
అందరి గురించి ఓ చిన్నా
ప్రకృతిని కాపాడేటందుకు
నడుంకట్టి పోరాడన్నా .

8, నవంబర్ 2012, గురువారం

కప్ప పిల్ల

బావిలో ఊటనీరు
ఉబికి ఉబికి పైకి వచ్చె
గట్టు నున్న కప్ప పిల్ల
బెక బెక మంటూ అరచె

నీటితోటి బావినిండ
ఎగిరిదూకె పిల్లకప్ప
నీటి లో పడగానే
కొత్త లోకమనిపించే

వరలపై ఎక్కిదూకి
నాచులో పొంగిపొరలి
నీటిలో ఈతకొట్టి
సంతసంతొ పరుగిడె

కొన్నాళ్ళకు తెలిసింది
అదొక చిన్న బావి అని
చుట్టాలు స్నేహితులు
ఎవరు దరిరారని

ఏమి చేయలేని కప్ప
వెక్కి వెక్కి ఏడ్చింది
నూతినే స్వర్గమంటు
జీవితాన్ని ఈడ్చింది.

 

22, జూన్ 2012, శుక్రవారం

చిన్నారి చిలుకమ్మ

చిట్టి చిట్టీ చిలుకమ్మ
చిన్నారి చిలుకమ్మ 
పెరటి లో జామచెట్టు 
కాయకాసింది. 
నువ్వొస్తే చిట్టి చెల్లి
కోసిస్తుంది. 
కాయకొరికి రుచి
నువ్వు చెప్పాలమ్మ
చిలక కొరికిన
జామకాయ రుచివేరమ్మ
కొమ్మచివర 
ఉయ్యాల వేస్తానమ్మ
నువ్వు వూగి 
నన్నుఊపి ఆడాలమ్మ
పిల్లలంత నీ కోసం
చూస్తున్నారు
స్నేహానికి చేతులు
చాస్తున్నారు.

21, ఏప్రిల్ 2012, శనివారం

ఐకమత్యమే బలం

పావురాల గుంపు ఒకటి
ఆకాశంలో ఎగురుతుంటె
భూమి మీద ఒక్కచోట
చిరు ధాన్యం కనిపించే

ఆహారం దొరికె నంటు
ఆతృతపడు వాని చూచి
వృద్ద పావురమ్ము ఒకటి
సందేహం వెలిబుచ్చెను

ఎవ్వరూ రానిచోట
తిండి గింజలేల వచ్చు
తొందరపడి ముందు కెడితె
ఆపదలే కొనితెచ్చు

అంటుండగ దాని చూచి
పిల్ల పావురములు నవ్వే
దొరికినది వదలమంటు
వెక్కిరించె వ్వె..వ్వె..వ్వె

లేనిపోని మాటలతో
వృదాకాల యాపనేల
అంటూ అన్ని కలసి
నూకలపై దాడి చేయ

కాళ్ళు చిక్కుక్కున్నవి
కళ్ళు బైర్లు కమ్మినవి
ఒక్కసారిగా మెదడు
మొద్దు బారిపొయినది

తామంతా ఒక్కటిగా
వలలో చిక్కామని
వేటగాడు రాగానే
రెక్కలిరగ గొడతాడని

నువుచెప్పిన మాటవినక
తూలనాడినామని
ఇప్పుడింక కర్తవ్యం
నీవేమరి చెప్పాలని

పెద్దపావురమ్ము వంక
మరి దీనంగా చూస్తూ
మాటలడె పావురాలు
వినయంగా.. వేడుకొనెను

ఆలోచన ఏమున్నది
అందరము ఒక్కటిగా...
కలిసి ఎగురుదాము పైకి
వలతో సహ దూరంగా..

నా మిత్రుడు ఒక ఎలుక
కొంత దవ్వు నున్నాడు
వాని వాడి పళ్ళ తోటి
వలను కొరికి వేస్తాడు

అనగానే అన్నికలసి
వలతో నింగి కెగిరె
దూరంగా మటేసిన
వేటగాడు విస్తుపోయె

వలకూడా పొయిందని
వేటగాడు వెక్కిఏడ్చె
ఎలుక వలను కొరికి వెయ
పావురములు సంతసించె

ఐకమత్యమే బలము
అన్నది నిజమయింది
పెద్దల మాట వినాలని
పిల్లలకప్పుడు తెలిసింది.

29, మార్చి 2012, గురువారం

ఉడుతా... ఉడుతా...



ఉడుతా... ఉడుతా...ఊత్..
అనుమాట.. నిజమాయెర కన్నా..
ఉడుత..కానరాదేర... చిన్నా...
ఎమై పోయిందిర ..నాన్న....

పెరటిలో జామ చెట్టున్నా ...
చెట్టు నిండుగా పండ్లున్నా....
అల్లరి చేసే ఉడుతా లేదు..
పెరటిలో ఆ సరదా లేదు


వేటగాడి బాణం వాడికి 
ఒకటొ.. రెండొ.. పోయినా గాని
మిగిలివన్నా సందడి చేసి
అలరించేవి ఆనాడు.

వాతవరణం బారినపడి..
ఉడుతజాతి నశించి పోతున్నా..
అయ్యో అనేనాధుడు లేడు
ఎవరికి వారే ఈనాడు.


శ్రే రామునికే సాయం చేసిన
చిన్ని ప్రాణి ఆ ఉడుత..
తోక వూపుతూ.. తిరుగాడి
కిచ..కిచ మనే ఆ బుడత...

కానరాకుండ పోతోంది
ఉడుతా... ఊయల అని
చదివే పుస్తకాలలో ఇమిడింది
పాఠము గా మిగిలిపోనుంది.



22, మార్చి 2012, గురువారం

శ్రి నందన నామ సంవత్సర ఉగాది.

వచ్చింది వచ్చింది ఉగాది.
వేస్తుంది కొత్త కొత్త ఆశలకు పునాది.


"నందన" శుభనామమై
అభినందన తెలుపుతూ
చందన సిరి గంధాలతో
అందముగా మనముందుకు
    //వచ్చింది//

నవవసంత చిరుజల్లు తో
ఎలమావుల పరిమళాలు
చిరుకొమ్మల తెరచాటున
వనకోకిల గానాలతొ
               //వచ్చింది//

లేతమావి వగరుకు
కొత్త చింతపులుపుతో
వేపచేదుకలుపుతూ
చెరకు తీపి తెలుపుతూ
         //వచ్చింది//


జీవనగమనములో భాధలన్ని చేదుగా
సంతొషం తీపిగా... చిరుకలతలు వగరుగా
చింతలన్ని ఫులుపుగా...
పరమార్ధం వెల్లడించు
పచ్చడి తో మనముందుకు
    //వచ్చింది//


తెలుగు కవుల మదినిండుగ
నవ్యకవిత వెళ్ళి విరియ
పండిత పంచాగ శ్రవణ
వేదిక కళ కళలాడగ
           //వచ్చింది//


శుభాలెన్నో కలిగిస్తూ
సాగాలీ ఈ ఉగాది
అనాదిగా తెలుగువారి
తొలి పండుగ యుగాది
...


ప్రియ మిత్రులకు...
ఉగాది  శుభాకాంక్షల తో
కూచిమంచి.


15, మార్చి 2012, గురువారం

ఆడించేవారెవరమ్మా.

సబ్బు నురగతో
బుడగలు చేసి
వుఫ్.. వుఫ్ మని
మీదకు ఊది..
అల్లరి చేసే..మాపిల్లను
ఆడించేది ఎవరమ్మా..
ఆటాడించేది..ఎవరమ్మా...

ఇసుకను తెచ్చి..
గుట్టగపోసి...
పిచ్చుక గూడని
 సందడి చేసి
మారాము చేసే...
మాపాపాయిని..
ఆడించేది ఎవరమ్మా..
ఆటాడించేది..ఎవరమ్మా...

కాగితాలను తీసుకుని
కత్తిపడవ చేస్తానని
చింపి ముక్కలు..ముక్కలు చేసి
ఇల్లంతా జల్లేసి
అందరి మద్యా
పరుగులు తీసి
అలసి సొలసె..
మాచిన్నారిని

ఆడించేది ఎవరమ్మా..
ఆటాడించేది..ఎవరమ్మా

నాన్నొచ్చారని
తెలుసుకుని
పలక బలపం
పుచ్చుకుని
చక్కగ చదివే
మంచి పిల్లలా
నాటకమాడే...
మా బుజ్జాయిని..

ఆడించేది ఎవరమ్మా..
ఆటాడించేది..ఎవరమ్మా









1, ఫిబ్రవరి 2012, బుధవారం

పిచ్చుక

ఏ దమ్మా.. పల్లె పిచ్చుక...
ఎక్కడమ్మ దాని కిచ కిచ.....

ముక్కున  పీచును పట్టుకొని..
చక్కగ దానిని పేర్చుకుని...
ఇంట్లొ గూడును కట్టేది
తెల్లని గుడ్లను పెట్టేది.

అద్దంలో తన బింబం చూసి
ముక్కుతొ టక టక కొట్టెది
తుర్రున.. రివ్వున  ఎగిరేది
గాలిలో తిరుగాడేది

అంతలోనె  తిరుగొచ్చేది
ఆహారమేదో తెచ్చేది.
పిల్లల నోటికి అందించి
సందడి సందడి చేసేది.

ఆధునికత నిదర్సనముగా
పెరిగిన సెల్ టవరు
పిచ్చుక బ్రహ్మస్త్రంగా...
రేడియేషన్ దాడి చేసింది.

ఇక.. ఊర పిచ్చుక జాడేది.
ఆ పల్లె పిచ్చుక... జాడేది.

23, జనవరి 2012, సోమవారం

గణతంత్రదినోత్సవం

జనవరి ఇరువదిఆరు
నిజమైన స్వతంత్య్ర దినం
అసలైన స్వతంత్ర దినం
అదే అదే గణ తంత్ర దినం

రవి హస్తమించని
సామ్రాజ్యమంటూ
విర్రవీగిన ఆంగ్లేయులను
తరిమికొట్టగా...తిరుగుబాటుగా...


సత్యాగ్రహమను ఆయుదమ్ము
చేపట్టెను ... గాంధీజీ...
శాంతిధూతగామారి...సమరం
సాగించెను నెహ్రు ...

వందేమాతర స్పూర్తిని  రగిలించె
మన భకించంద్రుడు  

జణగణమణ..అంటూ జాతిని
మెల్కొపెను.. రవీంద్రుడు..


సాయుద పొరాటమే మేలని
ఆయుదము పట్టె నేతాజి...
మన్యం విప్లవాగ్ని రగిల్చి..
అశువులు బాసెను అల్లూరి..


తిలక్.. పటేలు.. సరోజిని..
టంగుటూరి, కందుకూరి ..నౌరోజి

ఎందరో మానధనుల త్యాగఫలం..
మనంపొందిన స్వరాజ్యబలం...


నాటినాయకుల తలచుకొని
వీరగాధలను తెలుసుకుని..
స్పూర్తిని..పొందాలి...
సమాజ దీప్తిని..పెంచాలి...


ప్రియ పాఠకులందరికి,
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
          నాగేంద్ర.

12, జనవరి 2012, గురువారం

మన పండుగలు

గొబ్బెమ్మలతోనిండుగ
ముందుగవచ్చేపండుగ
భోగిమంటలు,బొమ్మలకొలువుతో
పిల్లలు మెచ్చేపండుగ.
                   భోగిపండుగ.
ముగ్గులువేసేపండుగ
ముచ్చటగొలిపేపండుగ
అంబరమంత సంబరమిచ్చే
మకరసంక్రాంతి పండుగ
                సంక్రాంతిపండుగ
కాంతులు నింపే పండుగ
కార్మిక , కర్షక పండుగ
విందులతొ సందడి చేసే
కమ్మని కనుమపండుగ.
                కనుమ పండుగ.
మూడు పండుగలు ముచ్చటైనవి
తెలుగువారికి ముఖ్యమైనవి
సంప్రదాయాలు చాటుచున్నవి.
సర్వశుభాలను తెచ్చుచున్నవి..

30, డిసెంబర్ 2011, శుక్రవారం

పాలపీక

పాల పీక...పాలపీక
పాలివ్వని....పాలపీక

సీసానిండుగ వుంటే
పాలు గుమ్మరిస్తుంది.
ఆ సీసా లెకుంటే
తెల్లమొహం వేస్తుంది.

కన్నతల్లిని మరపిస్తుంది.
చిన్నపిల్లలను లాలిస్తుంది.
ఆదమరచి నిదురింపగ బిడ్డకు
అమ్మలాగ తోడౌతుంది.

నోటనుంటె పాలపీక
పిల్ల మోమున చిరునవ్వు
నిదరొతున్నారని తేసావో
ఉయ్యాలలో.. కెవ్వు..కెవ్వు..

ఏమైనా పాలపీక
శిశువుల నేస్తం
ఎంత ఏడుపైనా సరే
ఆపే ....అస్త్రం.

29, డిసెంబర్ 2011, గురువారం

చుక్కల లేడి.

చుక్కల లేడి చక్కగ వుంది.
చెంగు చెంగున గెంతుచున్నది.
అడవి అంతా తనదేనంది
ఏ జంతువుకు బయపడనంది.

లేడి గెంతులు చూసిన నక్క
నక్కి చూసింది ఓ ప్రక్క
వేసింది పక్కా ప్రణాళిక
రెచ్చగొట్టింది పులినింక.

రెండూకలిపి మాటువేసెను
ఒక్కసారిగ దాడి చేసెను
ప్రమాదాన్ని గమనించినలేడి
పరుగులో పెంచింది వాడి.

ఆనాటి దాడి తప్పిన లేడి
అప్రమత్తతను పెంచింది
నాటినుండి నేటివరకు
బెదురుతోనె జీవిస్తోంది.