21, ఏప్రిల్ 2012, శనివారం

ఐకమత్యమే బలం

పావురాల గుంపు ఒకటి
ఆకాశంలో ఎగురుతుంటె
భూమి మీద ఒక్కచోట
చిరు ధాన్యం కనిపించే

ఆహారం దొరికె నంటు
ఆతృతపడు వాని చూచి
వృద్ద పావురమ్ము ఒకటి
సందేహం వెలిబుచ్చెను

ఎవ్వరూ రానిచోట
తిండి గింజలేల వచ్చు
తొందరపడి ముందు కెడితె
ఆపదలే కొనితెచ్చు

అంటుండగ దాని చూచి
పిల్ల పావురములు నవ్వే
దొరికినది వదలమంటు
వెక్కిరించె వ్వె..వ్వె..వ్వె

లేనిపోని మాటలతో
వృదాకాల యాపనేల
అంటూ అన్ని కలసి
నూకలపై దాడి చేయ

కాళ్ళు చిక్కుక్కున్నవి
కళ్ళు బైర్లు కమ్మినవి
ఒక్కసారిగా మెదడు
మొద్దు బారిపొయినది

తామంతా ఒక్కటిగా
వలలో చిక్కామని
వేటగాడు రాగానే
రెక్కలిరగ గొడతాడని

నువుచెప్పిన మాటవినక
తూలనాడినామని
ఇప్పుడింక కర్తవ్యం
నీవేమరి చెప్పాలని

పెద్దపావురమ్ము వంక
మరి దీనంగా చూస్తూ
మాటలడె పావురాలు
వినయంగా.. వేడుకొనెను

ఆలోచన ఏమున్నది
అందరము ఒక్కటిగా...
కలిసి ఎగురుదాము పైకి
వలతో సహ దూరంగా..

నా మిత్రుడు ఒక ఎలుక
కొంత దవ్వు నున్నాడు
వాని వాడి పళ్ళ తోటి
వలను కొరికి వేస్తాడు

అనగానే అన్నికలసి
వలతో నింగి కెగిరె
దూరంగా మటేసిన
వేటగాడు విస్తుపోయె

వలకూడా పొయిందని
వేటగాడు వెక్కిఏడ్చె
ఎలుక వలను కొరికి వెయ
పావురములు సంతసించె

ఐకమత్యమే బలము
అన్నది నిజమయింది
పెద్దల మాట వినాలని
పిల్లలకప్పుడు తెలిసింది.