30, డిసెంబర్ 2011, శుక్రవారం

పాలపీక

పాల పీక...పాలపీక
పాలివ్వని....పాలపీక

సీసానిండుగ వుంటే
పాలు గుమ్మరిస్తుంది.
ఆ సీసా లెకుంటే
తెల్లమొహం వేస్తుంది.

కన్నతల్లిని మరపిస్తుంది.
చిన్నపిల్లలను లాలిస్తుంది.
ఆదమరచి నిదురింపగ బిడ్డకు
అమ్మలాగ తోడౌతుంది.

నోటనుంటె పాలపీక
పిల్ల మోమున చిరునవ్వు
నిదరొతున్నారని తేసావో
ఉయ్యాలలో.. కెవ్వు..కెవ్వు..

ఏమైనా పాలపీక
శిశువుల నేస్తం
ఎంత ఏడుపైనా సరే
ఆపే ....అస్త్రం.

29, డిసెంబర్ 2011, గురువారం

చుక్కల లేడి.

చుక్కల లేడి చక్కగ వుంది.
చెంగు చెంగున గెంతుచున్నది.
అడవి అంతా తనదేనంది
ఏ జంతువుకు బయపడనంది.

లేడి గెంతులు చూసిన నక్క
నక్కి చూసింది ఓ ప్రక్క
వేసింది పక్కా ప్రణాళిక
రెచ్చగొట్టింది పులినింక.

రెండూకలిపి మాటువేసెను
ఒక్కసారిగ దాడి చేసెను
ప్రమాదాన్ని గమనించినలేడి
పరుగులో పెంచింది వాడి.

ఆనాటి దాడి తప్పిన లేడి
అప్రమత్తతను పెంచింది
నాటినుండి నేటివరకు
బెదురుతోనె జీవిస్తోంది.

23, డిసెంబర్ 2011, శుక్రవారం

క్రిస్ఠ్మస్ పండుగ.

రారాజు ఉద్భవించే
రాజ్యములను ఏలగ
రక్ష రక్ష ప్రజలకు
అతనిని ధ్యానింపగ

ఏసోబు మరియమ్మల
ముద్దు బిడ్డగ
క్రీస్తుజననమే మనకు
క్రిస్ఠ్మస్ పండుగ.

మానవత సమానత
తెలిపే ఈ పండుగ
శాంతి, క్రాంతి కలిపి
తేవాలి నిండుగ.

15, డిసెంబర్ 2011, గురువారం

తూనీగ....

తూనీగమ్మ...  తూనీగ..
మా పెరటిలో.. తూనీగ.
.
పక్షిలాంటిది..  తూనీగ.
పడితే దొరకని తూనీగ...

పొలంగట్ల పై   తూనీగ...
వర్షం తెచ్చే     తూనీగ...
.
దారం కడితే   తూనీగ...
గాలి పటం లే తూనీగ ..


పిల్లల నేస్తం    తూనీగ ....
రివ్వున ఎగిరే తూనీగ...

14, డిసెంబర్ 2011, బుధవారం

ఇంద్ర ధనస్సు

చిటపట చినుకులు
టప టప కురిసి
వాన వెలిసింది.

చల్లని గాలికి
నీటి భిందువు
వూగిసలాడింది.

తెల్లని కిరణం
ఏటవాలుగా
జాలువారింది.

ఆకాశంలో
ఇంద్రధనస్సు
వెల్లివిరిసింది.

బడిలో పిల్లలు
ఆశక్తిగా ఏడురంగులు
చూసారు

చక్కని పాఠం
తెలిసిందంటూ
సంతోషించారు.

13, డిసెంబర్ 2011, మంగళవారం

తెలుగు పాట


పాడాలని       వుంది తెలుగు పాట
మాటాడాలని వుంది తెలుగు మాట
అ..ఇ...ఉ...ఋ అను
అక్షరములు ఏబది ఆరు
అందు లొంచి జాలువారు
తెలుగు భాష నోరూరు.        /పా/

ఆరుద్ర....ఆత్రేయ
సి.నా.రే... సిరివెన్నల
సినీకవుల  గీ తాలను
నచ్చిన స్వరములు కట్టి
అందరు మెచ్చె విధముగ     /పా/

యండమూరి,   మల్లాది
యుద్దనపూడి ..మాదిరెడ్డి
నవలలన్ని తెచ్చుకుని
ఒకటొకటిగ చదువుకుంటు
కధలన్ని తెలుసుకుంటు.   /పా/

భారత... రామాయణాలు..
భాగవత...  పురాణాలు..
మనసుపెట్టి చదువుకుని
మర్మాలను తెలుసుకుని
మంచితనం పెంచుకుని   /పా/

భగవంతుని గీతాలను
భక్తి తోడ ఆలపించి
తెలుగు భాష తియ్యదనం
తేట తెల్ల మయ్యేట్టుగ
తెలుగు వెలుగు పండేట్టుగ
ఆ వెలుగు జిలుగు నిండేట్టుగ ../పా/

12, డిసెంబర్ 2011, సోమవారం

పరీక్షలు

బాలల్లారా.... బాలికలారా...
రండి...రా రండి.
పరీక్షలొచ్చే వెళాయె
ఫస్టుగ చదవండి.

అన్నివచ్చని తలవకుండగ
రానిది నేర్వండి
ఒక్కసారి వ్రాసారంటే
పదిమార్లు చదివినంతండి.


ఇష్టపడి చదివారంటె
ఎన్నడు మరుపే రాదండి
ఈనాడు కష్ట పడ్డారంటె
రేపటి భవితే మీదండి.

11, డిసెంబర్ 2011, ఆదివారం

శ్రమ జీవి - చీమ.

ప్రాణులలో చిన్నది
జ్ఞానమెంతొ వున్నది
కష్టపడి పనిచేసి
కూడ బెట్టు చున్నది.

కలిసి మెలిసి తిరుగుతూ
ఒక బారుగ కదులుతూ
స్నేహానికి అర్దాన్ని
చాటి చెప్పుచున్నది.

ఎదురెదురు పడగానే
పలకరింపులు
సోది చెప్పుకోకుండా
పనిముగింపులు.

నేర్చు కొంటె  చీమనుంచి
ఎంతో వుంది
క్రమ శిక్షణ మారుపేరు
చీమే  నండి.

10, డిసెంబర్ 2011, శనివారం

అందాల అరకులోయ.

అమ్మా,నాన్న, పిల్లలము
అరకు లోయకు వెళ్ళాము

రైలు బండి ఎక్కాము
కొండ గుహలను దాటాము
పూదోటలలొ నడిచాము
ధింసా నృత్యం చేసాము

బొర్రాగుహలను చూసాము
బోలెడు వింతలు కన్నాము

చలికి గడ గడ వణికాము
చప్పున రూముకు చేరాము

మా బడి.


చదువులమ్మ ఒడి
మాపల్లెలో బడి
నేర్పింది మాకు
ఓ మంచి నడవడి
పిల్లలకు వచ్చింది
ఓ కొత్త ఒరవడి

పాఠములలో ఫస్టు
పాట లందున ట్విస్టు
ఆటలపై ఇంట్రస్టు
మా స్కూలు ది బెస్టు

చక్కని బడి అంటె
అందరికి ముద్దు
చదివేటి పిల్లలకు
లేదండి హద్దు .

8, డిసెంబర్ 2011, గురువారం

సీతాకోకచిలక

గజిబిజి గొంగళి
పురుగును తెచ్చి
అగ్గిపెట్టెలో దాచాము
పచ్చని ఆకులు పెట్టాము
వెచ్చగ తలుపును మూసాము

లార్వా ప్యూపా దశలను చూసి
సీతా కోక చిలుకను చేసి
పువ్వుల తోటలొ వదిలాము
అల్లరి అల్లరి చేసాము
చల్లగ సేదతీరాము .

6, డిసెంబర్ 2011, మంగళవారం

నెమలి

అడవి లో చెట్టుమీద
అందమైన నెమలి వుంది
బారెడంత తోకతోటి
వనమంతా తిరుగుతోంది.

సూది వంటి ముక్కు తోటి
కాయ, గింజ కొరుకుతోంది
సన్ననైన గొంతుతోటి
రాగాలను పలుకుతొంది.

కారుమబ్బు కమ్మినపుడు
దాని ఆనందం పట్టలేము
పురివిప్పి నాట్యమాడ
అందం వెలకట్టలేము
.

5, డిసెంబర్ 2011, సోమవారం

సైకిలు

సైకిలమ్మ సైకిలు
అందరిదీ సైకిలు
ఇంధనంతొ పనిలేని
అందమైన సైకిలు

ఎవరైనా అడ్డొస్తే
ట్రింగ్ ట్రింగ్ బెల్లు
ఆపైనా ఫెడలేస్తే
దూసుకువెళ్ళు

రాత్రిపూట నడిపేందుకు
డైనమో లైటు
సడన్ గా ఆపేందుకు
బ్రెకుల సెట్టు

పేదా.. పెద్ద తేడా
లేని వాహనం
కాలుష్యం కలిగించని
ప్రయాణ సాధనం.



3, డిసెంబర్ 2011, శనివారం

రైలుబండి

చుక్ బుక్ చుక్ బుక్
రైలు బండి
ఎన్నో పెట్టెలు
లాగే బండి
ఎర్రని ఝండాకు
ఆగే బండి
పట్టాల మీద
నడిచే బండి

ప్రయాణానికి
చక్కని దండి.

2, డిసెంబర్ 2011, శుక్రవారం

అరటి మొక్క

నాన్నగారు నాటినారు
పెరటిలోన అరటిమొక్క
చూడముచ్చటగ ఉన్నది
చక్కనైన చిన్నిమొక్క.


లేతపచ్చ రంగు తోటి
ఆకులను అలిమింది
మొక్కనుండి తేనెవంటి
మొగ్గ తొంగి చూసింది.


మొగ్గనుండి అందమైన
అరటి గెల విరిసింది

తియ్యనైన పండ్ల తోటి
అరటి మొక్క మురిసింది.

1, డిసెంబర్ 2011, గురువారం

గడియారం

గణ గణ మోగే గడియారానికి
గంటలేమో పన్నెండు

గిర గిర తిరిగే టందుకున్నవి
ముళ్ళు రెండే రెండు

మనిషికి కాలం విలువని తెలుపు
ఏనాడు అది ఎరుగదు అలుపు
నీటి నీడా గడియారం
చేతి, గోడ గడియారం

లేకుంటే మరి గడియారం
తెలియదు కాలం కొలమానం
రంగు రంగుల గడియారం
మనిషి చేతికో మణిహారం.