10, డిసెంబర్ 2011, శనివారం

మా బడి.


చదువులమ్మ ఒడి
మాపల్లెలో బడి
నేర్పింది మాకు
ఓ మంచి నడవడి
పిల్లలకు వచ్చింది
ఓ కొత్త ఒరవడి

పాఠములలో ఫస్టు
పాట లందున ట్విస్టు
ఆటలపై ఇంట్రస్టు
మా స్కూలు ది బెస్టు

చక్కని బడి అంటె
అందరికి ముద్దు
చదివేటి పిల్లలకు
లేదండి హద్దు .

8, డిసెంబర్ 2011, గురువారం

సీతాకోకచిలక

గజిబిజి గొంగళి
పురుగును తెచ్చి
అగ్గిపెట్టెలో దాచాము
పచ్చని ఆకులు పెట్టాము
వెచ్చగ తలుపును మూసాము

లార్వా ప్యూపా దశలను చూసి
సీతా కోక చిలుకను చేసి
పువ్వుల తోటలొ వదిలాము
అల్లరి అల్లరి చేసాము
చల్లగ సేదతీరాము .

6, డిసెంబర్ 2011, మంగళవారం

నెమలి

అడవి లో చెట్టుమీద
అందమైన నెమలి వుంది
బారెడంత తోకతోటి
వనమంతా తిరుగుతోంది.

సూది వంటి ముక్కు తోటి
కాయ, గింజ కొరుకుతోంది
సన్ననైన గొంతుతోటి
రాగాలను పలుకుతొంది.

కారుమబ్బు కమ్మినపుడు
దాని ఆనందం పట్టలేము
పురివిప్పి నాట్యమాడ
అందం వెలకట్టలేము
.

5, డిసెంబర్ 2011, సోమవారం

సైకిలు

సైకిలమ్మ సైకిలు
అందరిదీ సైకిలు
ఇంధనంతొ పనిలేని
అందమైన సైకిలు

ఎవరైనా అడ్డొస్తే
ట్రింగ్ ట్రింగ్ బెల్లు
ఆపైనా ఫెడలేస్తే
దూసుకువెళ్ళు

రాత్రిపూట నడిపేందుకు
డైనమో లైటు
సడన్ గా ఆపేందుకు
బ్రెకుల సెట్టు

పేదా.. పెద్ద తేడా
లేని వాహనం
కాలుష్యం కలిగించని
ప్రయాణ సాధనం.



3, డిసెంబర్ 2011, శనివారం

రైలుబండి

చుక్ బుక్ చుక్ బుక్
రైలు బండి
ఎన్నో పెట్టెలు
లాగే బండి
ఎర్రని ఝండాకు
ఆగే బండి
పట్టాల మీద
నడిచే బండి

ప్రయాణానికి
చక్కని దండి.

2, డిసెంబర్ 2011, శుక్రవారం

అరటి మొక్క

నాన్నగారు నాటినారు
పెరటిలోన అరటిమొక్క
చూడముచ్చటగ ఉన్నది
చక్కనైన చిన్నిమొక్క.


లేతపచ్చ రంగు తోటి
ఆకులను అలిమింది
మొక్కనుండి తేనెవంటి
మొగ్గ తొంగి చూసింది.


మొగ్గనుండి అందమైన
అరటి గెల విరిసింది

తియ్యనైన పండ్ల తోటి
అరటి మొక్క మురిసింది.

1, డిసెంబర్ 2011, గురువారం

గడియారం

గణ గణ మోగే గడియారానికి
గంటలేమో పన్నెండు

గిర గిర తిరిగే టందుకున్నవి
ముళ్ళు రెండే రెండు

మనిషికి కాలం విలువని తెలుపు
ఏనాడు అది ఎరుగదు అలుపు
నీటి నీడా గడియారం
చేతి, గోడ గడియారం

లేకుంటే మరి గడియారం
తెలియదు కాలం కొలమానం
రంగు రంగుల గడియారం
మనిషి చేతికో మణిహారం.