30, నవంబర్ 2012, శుక్రవారం

ప్రకృతి



ఏమై పోతోంది మన ప్రకృతి
ఎక్కడి కెడుతోంది మన ప్రగతి

మనతో పాటు తిరుగాడే
జంతువులను చంపే దుస్థితి
పర్యావరణం రక్షించే
చెట్లన్నింటిని నరికే స్థితి.

అలికిడి చేయదు కుందేలమ్మా
ఆటలు ఆడే జింకేదమ్మా
నాట్యం చేసేనెమలేదమ్మా
పాటల మైనా కనరాదమ్మా

అడవిని పాలించే మృగరాజు
ఆతని తోడు నిలిచే పులిరాజు
సలహాలిచ్చే నక్కాలేదు
ఎలుగు, ఏనుగు కానరాదు.

పాము లేదు, పావురము లేదు
పాలపిట్ట జాడే తెలీదు
గ్రద్ద లేదు, పిచ్చుకలేదు
పక్షి జంతువులకు రక్షణలేదు

ఏపుగపెరిగే మొక్క లేదు
టేకు, గన్నర చెట్టు తెలీదు
చందన వృక్షపు చాయేలేదు
గంధపు వాసన అసలేరాదు

చెట్లను కొట్టే మానవులు
భవిత తెలీని దానవులు
మొక్కలు పెంచనివారు
వాటిని కొట్టేటందుకు తయారు.


అన్నితెలిసి చేసే తప్పుకు
భాధ్యత ఎవ్వరిది
ప్రకృతిని - వికృతిగా మార్చిన
పాపం ఎవ్వరిది.

చట్టాలెన్ని వున్నా
అడవికి రక్షణలేదు కన్నా
నాయకులెందరు వున్నా
న్యాయం జరగదు నాన్నా

ఆలోచించు ఇకనైనా
అందరి గురించి ఓ చిన్నా
ప్రకృతిని కాపాడేటందుకు
నడుంకట్టి పోరాడన్నా .

8, నవంబర్ 2012, గురువారం

కప్ప పిల్ల

బావిలో ఊటనీరు
ఉబికి ఉబికి పైకి వచ్చె
గట్టు నున్న కప్ప పిల్ల
బెక బెక మంటూ అరచె

నీటితోటి బావినిండ
ఎగిరిదూకె పిల్లకప్ప
నీటి లో పడగానే
కొత్త లోకమనిపించే

వరలపై ఎక్కిదూకి
నాచులో పొంగిపొరలి
నీటిలో ఈతకొట్టి
సంతసంతొ పరుగిడె

కొన్నాళ్ళకు తెలిసింది
అదొక చిన్న బావి అని
చుట్టాలు స్నేహితులు
ఎవరు దరిరారని

ఏమి చేయలేని కప్ప
వెక్కి వెక్కి ఏడ్చింది
నూతినే స్వర్గమంటు
జీవితాన్ని ఈడ్చింది.

 

22, జూన్ 2012, శుక్రవారం

చిన్నారి చిలుకమ్మ

చిట్టి చిట్టీ చిలుకమ్మ
చిన్నారి చిలుకమ్మ 
పెరటి లో జామచెట్టు 
కాయకాసింది. 
నువ్వొస్తే చిట్టి చెల్లి
కోసిస్తుంది. 
కాయకొరికి రుచి
నువ్వు చెప్పాలమ్మ
చిలక కొరికిన
జామకాయ రుచివేరమ్మ
కొమ్మచివర 
ఉయ్యాల వేస్తానమ్మ
నువ్వు వూగి 
నన్నుఊపి ఆడాలమ్మ
పిల్లలంత నీ కోసం
చూస్తున్నారు
స్నేహానికి చేతులు
చాస్తున్నారు.

21, ఏప్రిల్ 2012, శనివారం

ఐకమత్యమే బలం

పావురాల గుంపు ఒకటి
ఆకాశంలో ఎగురుతుంటె
భూమి మీద ఒక్కచోట
చిరు ధాన్యం కనిపించే

ఆహారం దొరికె నంటు
ఆతృతపడు వాని చూచి
వృద్ద పావురమ్ము ఒకటి
సందేహం వెలిబుచ్చెను

ఎవ్వరూ రానిచోట
తిండి గింజలేల వచ్చు
తొందరపడి ముందు కెడితె
ఆపదలే కొనితెచ్చు

అంటుండగ దాని చూచి
పిల్ల పావురములు నవ్వే
దొరికినది వదలమంటు
వెక్కిరించె వ్వె..వ్వె..వ్వె

లేనిపోని మాటలతో
వృదాకాల యాపనేల
అంటూ అన్ని కలసి
నూకలపై దాడి చేయ

కాళ్ళు చిక్కుక్కున్నవి
కళ్ళు బైర్లు కమ్మినవి
ఒక్కసారిగా మెదడు
మొద్దు బారిపొయినది

తామంతా ఒక్కటిగా
వలలో చిక్కామని
వేటగాడు రాగానే
రెక్కలిరగ గొడతాడని

నువుచెప్పిన మాటవినక
తూలనాడినామని
ఇప్పుడింక కర్తవ్యం
నీవేమరి చెప్పాలని

పెద్దపావురమ్ము వంక
మరి దీనంగా చూస్తూ
మాటలడె పావురాలు
వినయంగా.. వేడుకొనెను

ఆలోచన ఏమున్నది
అందరము ఒక్కటిగా...
కలిసి ఎగురుదాము పైకి
వలతో సహ దూరంగా..

నా మిత్రుడు ఒక ఎలుక
కొంత దవ్వు నున్నాడు
వాని వాడి పళ్ళ తోటి
వలను కొరికి వేస్తాడు

అనగానే అన్నికలసి
వలతో నింగి కెగిరె
దూరంగా మటేసిన
వేటగాడు విస్తుపోయె

వలకూడా పొయిందని
వేటగాడు వెక్కిఏడ్చె
ఎలుక వలను కొరికి వెయ
పావురములు సంతసించె

ఐకమత్యమే బలము
అన్నది నిజమయింది
పెద్దల మాట వినాలని
పిల్లలకప్పుడు తెలిసింది.

29, మార్చి 2012, గురువారం

ఉడుతా... ఉడుతా...



ఉడుతా... ఉడుతా...ఊత్..
అనుమాట.. నిజమాయెర కన్నా..
ఉడుత..కానరాదేర... చిన్నా...
ఎమై పోయిందిర ..నాన్న....

పెరటిలో జామ చెట్టున్నా ...
చెట్టు నిండుగా పండ్లున్నా....
అల్లరి చేసే ఉడుతా లేదు..
పెరటిలో ఆ సరదా లేదు


వేటగాడి బాణం వాడికి 
ఒకటొ.. రెండొ.. పోయినా గాని
మిగిలివన్నా సందడి చేసి
అలరించేవి ఆనాడు.

వాతవరణం బారినపడి..
ఉడుతజాతి నశించి పోతున్నా..
అయ్యో అనేనాధుడు లేడు
ఎవరికి వారే ఈనాడు.


శ్రే రామునికే సాయం చేసిన
చిన్ని ప్రాణి ఆ ఉడుత..
తోక వూపుతూ.. తిరుగాడి
కిచ..కిచ మనే ఆ బుడత...

కానరాకుండ పోతోంది
ఉడుతా... ఊయల అని
చదివే పుస్తకాలలో ఇమిడింది
పాఠము గా మిగిలిపోనుంది.



22, మార్చి 2012, గురువారం

శ్రి నందన నామ సంవత్సర ఉగాది.

వచ్చింది వచ్చింది ఉగాది.
వేస్తుంది కొత్త కొత్త ఆశలకు పునాది.


"నందన" శుభనామమై
అభినందన తెలుపుతూ
చందన సిరి గంధాలతో
అందముగా మనముందుకు
    //వచ్చింది//

నవవసంత చిరుజల్లు తో
ఎలమావుల పరిమళాలు
చిరుకొమ్మల తెరచాటున
వనకోకిల గానాలతొ
               //వచ్చింది//

లేతమావి వగరుకు
కొత్త చింతపులుపుతో
వేపచేదుకలుపుతూ
చెరకు తీపి తెలుపుతూ
         //వచ్చింది//


జీవనగమనములో భాధలన్ని చేదుగా
సంతొషం తీపిగా... చిరుకలతలు వగరుగా
చింతలన్ని ఫులుపుగా...
పరమార్ధం వెల్లడించు
పచ్చడి తో మనముందుకు
    //వచ్చింది//


తెలుగు కవుల మదినిండుగ
నవ్యకవిత వెళ్ళి విరియ
పండిత పంచాగ శ్రవణ
వేదిక కళ కళలాడగ
           //వచ్చింది//


శుభాలెన్నో కలిగిస్తూ
సాగాలీ ఈ ఉగాది
అనాదిగా తెలుగువారి
తొలి పండుగ యుగాది
...


ప్రియ మిత్రులకు...
ఉగాది  శుభాకాంక్షల తో
కూచిమంచి.


15, మార్చి 2012, గురువారం

ఆడించేవారెవరమ్మా.

సబ్బు నురగతో
బుడగలు చేసి
వుఫ్.. వుఫ్ మని
మీదకు ఊది..
అల్లరి చేసే..మాపిల్లను
ఆడించేది ఎవరమ్మా..
ఆటాడించేది..ఎవరమ్మా...

ఇసుకను తెచ్చి..
గుట్టగపోసి...
పిచ్చుక గూడని
 సందడి చేసి
మారాము చేసే...
మాపాపాయిని..
ఆడించేది ఎవరమ్మా..
ఆటాడించేది..ఎవరమ్మా...

కాగితాలను తీసుకుని
కత్తిపడవ చేస్తానని
చింపి ముక్కలు..ముక్కలు చేసి
ఇల్లంతా జల్లేసి
అందరి మద్యా
పరుగులు తీసి
అలసి సొలసె..
మాచిన్నారిని

ఆడించేది ఎవరమ్మా..
ఆటాడించేది..ఎవరమ్మా

నాన్నొచ్చారని
తెలుసుకుని
పలక బలపం
పుచ్చుకుని
చక్కగ చదివే
మంచి పిల్లలా
నాటకమాడే...
మా బుజ్జాయిని..

ఆడించేది ఎవరమ్మా..
ఆటాడించేది..ఎవరమ్మా









1, ఫిబ్రవరి 2012, బుధవారం

పిచ్చుక

ఏ దమ్మా.. పల్లె పిచ్చుక...
ఎక్కడమ్మ దాని కిచ కిచ.....

ముక్కున  పీచును పట్టుకొని..
చక్కగ దానిని పేర్చుకుని...
ఇంట్లొ గూడును కట్టేది
తెల్లని గుడ్లను పెట్టేది.

అద్దంలో తన బింబం చూసి
ముక్కుతొ టక టక కొట్టెది
తుర్రున.. రివ్వున  ఎగిరేది
గాలిలో తిరుగాడేది

అంతలోనె  తిరుగొచ్చేది
ఆహారమేదో తెచ్చేది.
పిల్లల నోటికి అందించి
సందడి సందడి చేసేది.

ఆధునికత నిదర్సనముగా
పెరిగిన సెల్ టవరు
పిచ్చుక బ్రహ్మస్త్రంగా...
రేడియేషన్ దాడి చేసింది.

ఇక.. ఊర పిచ్చుక జాడేది.
ఆ పల్లె పిచ్చుక... జాడేది.

23, జనవరి 2012, సోమవారం

గణతంత్రదినోత్సవం

జనవరి ఇరువదిఆరు
నిజమైన స్వతంత్య్ర దినం
అసలైన స్వతంత్ర దినం
అదే అదే గణ తంత్ర దినం

రవి హస్తమించని
సామ్రాజ్యమంటూ
విర్రవీగిన ఆంగ్లేయులను
తరిమికొట్టగా...తిరుగుబాటుగా...


సత్యాగ్రహమను ఆయుదమ్ము
చేపట్టెను ... గాంధీజీ...
శాంతిధూతగామారి...సమరం
సాగించెను నెహ్రు ...

వందేమాతర స్పూర్తిని  రగిలించె
మన భకించంద్రుడు  

జణగణమణ..అంటూ జాతిని
మెల్కొపెను.. రవీంద్రుడు..


సాయుద పొరాటమే మేలని
ఆయుదము పట్టె నేతాజి...
మన్యం విప్లవాగ్ని రగిల్చి..
అశువులు బాసెను అల్లూరి..


తిలక్.. పటేలు.. సరోజిని..
టంగుటూరి, కందుకూరి ..నౌరోజి

ఎందరో మానధనుల త్యాగఫలం..
మనంపొందిన స్వరాజ్యబలం...


నాటినాయకుల తలచుకొని
వీరగాధలను తెలుసుకుని..
స్పూర్తిని..పొందాలి...
సమాజ దీప్తిని..పెంచాలి...


ప్రియ పాఠకులందరికి,
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
          నాగేంద్ర.

12, జనవరి 2012, గురువారం

మన పండుగలు

గొబ్బెమ్మలతోనిండుగ
ముందుగవచ్చేపండుగ
భోగిమంటలు,బొమ్మలకొలువుతో
పిల్లలు మెచ్చేపండుగ.
                   భోగిపండుగ.
ముగ్గులువేసేపండుగ
ముచ్చటగొలిపేపండుగ
అంబరమంత సంబరమిచ్చే
మకరసంక్రాంతి పండుగ
                సంక్రాంతిపండుగ
కాంతులు నింపే పండుగ
కార్మిక , కర్షక పండుగ
విందులతొ సందడి చేసే
కమ్మని కనుమపండుగ.
                కనుమ పండుగ.
మూడు పండుగలు ముచ్చటైనవి
తెలుగువారికి ముఖ్యమైనవి
సంప్రదాయాలు చాటుచున్నవి.
సర్వశుభాలను తెచ్చుచున్నవి..