ఆకుపచ్చ అడవిలో
నల్లనైనా కోయిలమ్మ
కుహు కుహు అంటూ
కొత్తపాట పాడుతోంది.
ఆ పాటకు పరవసించే
కొమ్మమీది పిల్ల కాకి
అమ్మతోటి చెప్పింది
పాటపాడ నేర్పమని.
మన ఇంటనే పుట్టిందది
పిచ్చి పాట పాడుతోంది
మనకెందుకు రాగాలు
కావు.. కావు.. మనకు చాలు.
పెద్దకాకి మాటలకు
చిన్నబోయే బుల్లికాకి
ముద్దకూడ తినకుండా
అలిగి మూల కూర్చుంది.
పిల్లని ఓదార్చ లేక
కోయిలతో మాటలాడి
తన పిల్లకు మంచి పాట
నేర్పమంది అమ్మకాకి.
దానికేమి భాగ్య మమ్మ
ఉదయాన్నే పంపు దాన్ని
సరిగమలు నేర్పిస్తా!
నా అంతదాన్ని చేస్తా!
తల్లి ఆనతివ్వగానే
గురువు చేరే కాకిపిల్ల
కాళ్ళకు శ్రద్ధ గా మొక్కి
సాధనను మొదలుపెట్టే.
కాలము గడిచెను కానీ
సరిగమలను దాటలేదు
విసుగుపుట్టి గురువుపైన
తిరగబడెను ఒకనాడు.
పాటనెర్ప వేమీ నాకు
సంగీతం నాకెందుకు
నేర్పడ యిష్టం లేక
సాధనతో గడుపుతావు.
సంగీతం నేర్చుకుంటే
పాటపాడా తెలుస్తుంది
నీకు నువ్వు కూర్చుకుంటే
కొత్తపాట జనిస్తుంది.
ఒకే పాట నేర్చుకుంటే
అక్కడనే నిలుస్తావు
మరోపాట పాడమంటే
బిక్క మొహం వేస్తావు.
గురువుగారి మాటలతో
తే రుకుంది బుల్లికాకి
క్షమించ మంటూ వేడి
సాధన మొదలెట్టింది.
ఆనతి కాలం లోనే
ఔపాశన పట్టింది
కాకి జాతి లోనే తాను
కోయాలగా మారింది.